మ్యాచ్‌కు ముందు కార్టూన్లు చూస్తా: వైభవ్ సూర్యవంశీ

  • ప్రతి మ్యాచ్‌కు ముందు కార్టూన్లు చూస్తానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచిన వైభవ్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యువ సంచలనం నిజాయతీ వ్యాఖ్యలు
  • వేగవంతమైన 500 పరుగుల ఘనతలో మ్యాక్స్‌వెల్ ను అధిగమించిన సూర్య‌వంశీ
రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. నిన్న‌ లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 8 పరుగులే చేసినప్పటికీ, ఐపీఎల్‌ చరిత్రలో 500 పరుగులు పూర్తి చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

అంతేగాక‌ ఎదుర్కొన్న బంతుల పరంగా వేగంగా ఈ మైలురాయిని చేరుకుని, ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ పేరిట ఉన్న రికార్డును కూడా వైభవ్ బద్దలుకొట్టాడు. ఈ ఘనత సాధించిన తర్వాత అతను పంచుకున్న విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ... "నా బుర్రలో పెద్దగా ఏమీ ఆలోచించను. ఇప్పటికీ ప్రతి మ్యాచ్‌కు ముందు కార్టూన్లు చూస్తాను. అది నాకు అలవాటు. అయితే, ఆటపైనే పూర్తి ఫోకస్ ఉంటుంది" అని నవ్వుతూ చెప్పాడు. చిన్న వయసులోనే స్టార్‌డమ్ వచ్చినా, తనలోని చిన్నపిల్లల అలవాటును నిజాయతీగా చెప్పడంతో నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

"తర్వాతి మ్యాచ్‌లో కచ్చితంగా బాగా ఆడతాను. ఈ విజయంతో రెండు పాయింట్లు సాధించాం. ప్లేఆఫ్స్ దిశగా ముందుకు వెళ్తాం" అని వైభవ్ ధీమా వ్యక్తం చేశాడు.

Vaibhav Suryavanshi
Rajasthan Royals
IPL
Lucknow Super Giants
Glenn Maxwell
Youngest IPL Player
Cricket Record
IPL 2024
Indian Premier League
Cartoon habit

More Telugu News